చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్
నామినేషన్ కేంద్రంలో సీపీ ఆకస్మిక తనిఖీ
చేర్యాలలో నామినేషన్ ప్రక్రియ పరిశీలన
కాకతీయ, చేర్యాల :మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ గురువారం పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉండాలని, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో చేర్యాల సీఐ బానోతు రమేష్, ఎస్సై నవీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్. నాగేందర్, మున్సిపల్ ఆర్‌ఐ డి. కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా చేర్యాల పట్టణ సరిహద్దులోని చెక్‌పోస్టును సీపీ రష్మి పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలను పరిశీలించిన ఆమె, సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిఘా మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


