పండగ పూట ఎందుకొచ్చినట్టు?!
ఏనుమాముల మార్కెట్‌కు స్టేట్ విజిలెన్స్ టీమ్
జాతర వేళ విచారణ సాధ్యమా?
వ్యాపారులే లేని చోట నిజాలు ఎలా తేలుతాయి..!
కాకతీయ, వరంగల్ : విజిలెన్స్ పేరు వినగానే అధికారుల్లో హడల్ మొదలవుతుంది. ఏ ప్రశ్నలు వేస్తారో, ఏ సమాధానాలు ఇవ్వాలో అన్న ఆందోళన సహజం. కానీ అలాంటి ఉత్కంఠ ఏమీ లేకుండానే గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను విజిలెన్స్ అధికారులు సందర్శించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. రైతులు, వ్యాపారులు, కార్మికులు అందరూ వనదేవతల దర్శనానికి తరలిపోతారు. ఈ నేపథ్యంలోనే ఏనుమాముల మార్కెట్ యార్డులో నాలుగు రోజుల పాటు లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ అధికారులు ముందుగానే ప్రకటించారు. రైతులు రారని, వ్యాపారాలు సాగవని తెలిసిన పరిస్థితుల్లో విజిలెన్స్ అధికారులు మార్కెట్‌కు రావడం ఆశ్చర్యంగా మారింది.
మార్కెట్ బోసిపోయిన వేళ
విజిలెన్స్ బృందం మార్కెట్‌కు చేరుకున్న సమయానికి అధికారులు మినహా అక్కడ ఒక్క రైతు కూడా లేడు. అడ్డీలు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు ఎవ్వరూ కనిపించలేదు. సాధారణంగా రద్దీగా ఉండే ఏనుమాముల మార్కెట్ పండగ వేళ పూర్తిగా బోసిపోయి దర్శనమిచ్చింది. షాపులన్నీ మూసి ఉండగా, లావాదేవీల ఆనవాళ్లే కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజిలెన్స్ విచారణ ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులు లేకుండా, వ్యాపారులు లేకుండా, కమిషన్ ఏజెంట్లు లేకుండా ఏ అంశంపై విచారణ చేయాలన్న సందేహం వ్యక్తమవుతోంది. అసలు మార్కెట్‌లో అక్రమాలు, అవకతవకలపై సమాచారం సేకరించాలంటే సంబంధిత వర్గాలు అక్కడ ఉండాల్సిందే కదా అన్న వాదన వినిపిస్తోంది.
జాతర సంగతి తెలియదా?
మేడారం జాతర రాష్ట్రపండుగ స్థాయిలో జరుగుతుందన్న విషయం అధికారులకు తెలియదా? జాతర వేళ మార్కెట్లు మూసి ఉంటాయన్న సమాచారం విజిలెన్స్ విభాగానికి అందలేదా? లేక జాతర కోసం వెళ్తూ, వెళ్తూ ఇటువైపు కూడా వచ్చారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు అయితే ‘‘విచారణ కోసం వచ్చారా? లేక వచ్చామని చూపించుకోవడానికే వచ్చారా?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల పర్యటనపై మార్కెట్ అధికారులను సంప్రదించగా, వారు ఎలాంటి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఏ అంశంపై విజిలెన్స్ బృందం వచ్చిందన్నది కూడా చెప్పకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఇక విజిలెన్స్ అధికారులు మూసివేసిన షాపుల ముందు ఫొటోలు దిగడం, ఖాళీ మార్కెట్‌ను పరిశీలించినట్లు చూపించుకోవడం పండగపూట ఆటవిడుపులా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులే లేని చోట విచారణలు, తనిఖీలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో అన్న సందేహాలు ఇప్పటికీ తీరడం లేదు.


