గౌరవం దక్కలేదు
జట్టులో మద్దతూ లభించలేదు
కోరుకున్న స్థానం పొందలేకపోయా
అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పా
యువరాజ్ సింగ్ హాట్ కామెంట్స్
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: భారత అత్యుత్తమ క్రికెటర్లలో మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఒకరు. టీమ్ఇండియా 2011 వన్డే వరల్డ్‌కప్ నెగ్గడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఇదొక్కడే కాకుండా కెరీర్‌లో యువీ అనేక ఘనతలు అందుకొని లెజెండరీ బ్యాటర్‌గా పేరు సంపాదించాడు. అలాంటి యువీ 2019 వన్డే వరల్డ్‌కప్‌లో స్థానం దక్కకపోవడంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తన రిటైర్మెంట్ గురించి యువీ మాట్లాడలేదు. అయితే ఏడేళ్ల తర్వాత తొలిసారి యువీ తన రిటైర్మెంట్ కారణాలు వెల్లడించాడు. రెండు ప్రధాన కారణాల వల్లే తాను ఆటకు గుడ్ బై చెప్పినట్లు యువీ తెలిపాడు. ఈ మేరకు తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. “రిటైర్మెంట్కు ముందు, నా ఆటను నేను ఆస్వాదించలేకపోయాను. జట్టులో నాకు తగిన మద్దతు, గౌరవం లభించడం లేదని నాకు అనిపించడం మొదలైంది. అప్పుడు నేను క్రికెట్ ఆడటం ఎందుకు కొనసాగించాలి? అని ఆలోచించడం మొదలుపెట్టా? నేను కోరుకున్నది నాకు లభించనప్పుడు, నేను ఇంకా ఏం నిరూపించుకోవాలి అని అనిపించింది. అలాగే, నేను మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇంతకన్నా ఏం చేయలేనని అనిపించింది. అందుకే రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నేను క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత తర్వాత నేను సాధారణ స్థితికి వచ్చాను” అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
యువరాజ్ కెరీర్
2000 సంవత్సరంలో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కెన్యాతో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇక 2017లో చివరి వన్డే ఆడాడు. మొత్తం 304 వన్డేల్లో 8,701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కెరీర్‌లో 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 1,900 పరుగులు చేశాడు. టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20ల్లో తనదైన ముద్ర వేశాడు. 58 మ్యాచ్‌ల్లో 1,177 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా యువీ అంతర్జాతీయ కెరీర్‌లో 11,778 పరుగులు, 148 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్లో 132 మ్యాచ్‌ల్లో 2,750 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు చేశాడు.


