దమ్ముంటే రాజీనామా చేసి గెలువు
నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా
నేను చదవుకున్నవాడిని.. నాకు సంస్కారం ఉంది..
పదేళ్లలో ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టలేదు
నేను క్లబుల్లో తిరుగను.. కోడి పందాలు ఆడను
పేదల గుడిసెలు కూల్చడమే అభివృద్ధా..?!
ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా ఏతులు కొట్టొద్దు
పశ్చిమ ఎమ్మెల్యే నాయినిపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
కాకతీయ, హన్మకొండ : దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి గెలువు.. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ సవాల్ విసిరారు. తనపై, పార్టీపై నమ్మకం ఉందని, అందుకే సవాల్ చేస్తున్నానన్నారు. జాతర తర్వాత రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని నాయినికి సవాల్ విసిరారు. తాను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాను చదువుకున్నవాడినని, సంస్కారం ఉన్నవాడినని వినయ్ భాస్కర్ చెప్పారు. క్లబ్‌లు, కోళ్ల పందాలు, ఆర్భాటాలు తన రాజకీయ సంస్కృతి కాదంటూ నాయిని రాజేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ అన్నారు. బయటకు వెళ్తే గుడులు, మసీదులు, చర్చిలకు మాత్రమే వెళ్తానని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రజల ఆకాంక్షల కోసం పదవులు వదిలి పోరాటాలు చేసిన చరిత్ర తనదని చెప్పారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ఎవరి వద్ద మొదలై ఎవరి వద్ద ఆగిపోదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలన్నింటినీ నెరవేర్చామని, ప్రత్యర్థుల్లా మాటలకే పరిమితం కాలేదని ఒక ప్రజాప్రతినిధి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, సిఫారసులు–రికమండేషన్ల రాజకీయానికి తాను దూరమని స్పష్టం చేశారు. నాయిని తండ్రి అయినా నాయిని నరేందర్ బాపుకు చేతులు జోడించి చెప్తున్నా.. బాపు నీ కొడుకు కు ఈ చిల్లర మాటలు మానేయమని చెప్పు.. కార్యకర్తలతో ఎలా ఉండాలో చెప్పు.. ప్రజలకు ఎలా పని చేయాలని చెప్పు… గతంలో నిన్ను కలిసేవాడిని.. ఈ పరిస్థితి లో కలవలేకపోతున్నానని అన్నారు. కార్యకర్తలతో ఎలా ఉండాలో, ప్రజల కోసం ఎలా పని చేయాలో నేర్పించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర స్థాయిలో నాయినిపై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో నీచమైన మాటలు, కూల్చివేతల సంస్కృతి తానెప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు.దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు అమలు చేశామని, అందులో అవినీతి జరిగిందని అంటున్నవారు నిరూపించాలని సవాల్ చేశారు. సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్, చెత్త ఏరుకునే వర్గాలకూ దళితబంధు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో జరిగిన స్కాంల గురించి ప్రజలే మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇదేనా నువ్వు చేస్తున్న అభివృద్ధి..
కాళోజి కళాక్షేత్రానికి రంగులు వేసి తానే కట్టానని ఆయన చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 250 కోట్లకు జీవోలు తెచ్చి బిల్లులతో పనులు చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. భద్రకాళి మాడవీధులకు 30 కోట్లు తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. భద్రకాళి చెరువు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో హనుమకొండ, వరంగల్ ప్రాంతాలు మునిగిపోయాయని, వందలాది మంది ఇబ్బందులు పడ్డారని, లక్షలాది ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. చెరువు మట్టిలో అవకతవకలపై కాంట్రాక్టర్లకు దొంగ బిల్లులు ఇప్పించారని విమర్శించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, స్మశానవాటికలు అభివృద్ధి చేసిన ఘనత తమదని చెప్పారు. నియోజకవర్గంలో డివిజన్ల హద్దులు కూడా తెలియని వారు తనకు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు.
పేదల గుడిసెలు కూల్చడమే అభివృద్ధా..?!
వరంగల్ భద్రకాళి గుడి సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెలను, తమ పార్టీ కార్యకర్తల షాపులను కూల్చివేయడం దారుణమని విమర్శించారు. అధికార బలంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. అందరు పోలీసులు ఇలా చేయడం లేదని, కొందరు మాత్రమే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తామని, దళితులపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు. సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు తిడతారని, అప్పుడు వారిని తిట్టకుండా న్యాయం చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, మేకల బాబు రావు, నాయకురాలు పుష్ప, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, సల్వాజి రవీందర్ రావు, ఇమ్మడి రాజు, సదాంత్, చందర్, శ్రీధర్, డా.మనోజ్, కనకరాజు, కోటిలింగం, విక్రమ్, మహమూద్, శ్రీనివాస్, ఖలీల్, మహేందర్, శ్రీకాంత్, వీరస్వామి, రాకేష్ యాదవ్, రాజ్‌కుమార్, రాజు, సారిక, ప్రదీప్, వినయ్, ప్రకాష్, శరత్ చంద్ర, రంజిత్, గోపాల్, శ్రీనాథ్, ఫాజిల్, రాంచందర్, స్నేహిత్, సృజన్ కుమార్, రఘు, అనిల్, హబీబ్, వినీల్ రావు, జేకే తదితరులు పాల్గొన్నారు.


