పకడ్బందీగా మేడారం
ప్రభుత్వం కంటిన్యూగా మానిటరింగ్!
భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు
జంపన్నవాగు వద్ద స్వయంగా తనిఖీలు
తప్పిపోయిన వారికి ప్రత్యేక శిబిరం
పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం
రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
కాకతీయ, మేడారం బృందం : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర పకడ్బందీగా కొనసాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం జాతర నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. గురువారం ఉదయం మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి బైక్‌పై జాతర ప్రాంతాన్ని పరిశీలించారు. జంపన్నవాగు వద్ద భక్తుల స్నానాల ఏర్పాట్లు, పరిసర ప్రాంతాల పారిశుధ్యం, భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


భక్తుల భద్రతే ప్రథమ లక్ష్యం
మంత్రి మాట్లాడుతూ.. భారీగా భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా వైద్య బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. జాతర సందర్భంగా తప్పిపోయే భక్తులను వారి కుటుంబాలకు చేర్చేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ శిబిరం ద్వారా చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా తమ వారిని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేడారం మహాజాతరలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జాతర ప్రాంగణం, దర్శన మార్గాలు, అన్ని సెక్టార్లలో నిరంతరంగా వ్యర్థాలను తొలగిస్తూ పరిశుభ్రత పాటిస్తున్నామని చెప్పారు. అమ్మవారి గద్దెల వద్ద శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టామని, భక్తులు సమర్పించే బెల్లం, మొక్కులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ శుభ్రతను కాపాడుతున్నామని వివరించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకరతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణతో మేడారం మహాజాతరను విజయవంతంగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.


