నేతల ప్రచార జాతర!
అమ్మవారిపేటలో నిబంధనలకు విరుద్ధంగా ప్లెక్సీలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రజల్లో అసహనం
దేవాలయ పరిసరాల్లో రాజకీయ హంగామా
కాకతీయ, వరంగల్ : జనసందోహం ఎక్కడుంటే అక్కడే ప్రచారం చేయాలన్న రాజకీయ నేతల ఆతృత మరోసారి వివాదానికి దారి తీసింది. వరంగల్ నగరం ఉర్సుగుట్ట ఏరియాలోని అమ్మవారిపేటలో జరుగుతున్న సమ్మక్క జాతర ప్రాంగణంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు కారణమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న వేళ, దేవాలయాల సమీపంలో రాజకీయ ప్రచారం చేయకూడదన్న నిబంధనలను విస్మరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులు, స్థానికులు ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి జాతరను రాజకీయ వేదికగా మార్చడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వినిపిస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రతిపక్షాల అభ్యంతరం..
ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార పార్టీ నేతలతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో జాతర ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు, మహిళలు ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు.
సీఐ కిషన్ చొరవతో సద్దుమణిగిన వివాదం..!
వివాదం తీవ్రతరమవుతుండటంతో సమాచారం అందుకున్న సీఐ కిషన్ అమ్మవారిపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాల నాయకులను సముదాయించి, ఎన్నికల కోడ్ పాటించాలని సూచించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ రవీంద్ర డీ. రాడేకర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని సమాచారం. ఎన్నికల వేళ దేవాలయాలు, జాతరల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


