కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో 1616, ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఈపోస్టులకు సెప్టెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తాజా నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ పూర్తయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. తద్వారా జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయి. పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కానున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్యశాఖలో ఇప్పటికే దాదాపు 8వేల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వ భర్తీ చేసింది. మరో 7వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వేరేగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


