పారిశుద్ధ్యమే జాతరలో కీలకం
285 బ్లాకులుగా జాతర ప్రాంతం విభజన
5,700 టాయిలెట్లు… 5,000 మంది సిబ్బంది
జంతు కళేబరాలు–ప్లాస్టిక్‌పై ప్రత్యేక నిఘా
భక్తుల సహకారమే విజయానికి మూలం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను పరిశుభ్రంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరొందిన ఈ మహాజాతరకు ఈసారి రెండు నుంచి మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని 100 కోట్ల రూపాయలకుపైగా నిధులు వెచ్చిస్తోంది. జాతర ఏర్పాట్లలో పారిశుద్ధ్యమే అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు. గత నెల రోజుల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి చేరుకుని అమ్మవార్లను దర్శించుకుంటుండటంతో, చెత్త పేరుకుపోకుండా, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

285 బ్లాకులుగా జాతర ప్రాంతం
పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించేందుకు మేడారం జాతర ప్రాంతాన్ని మొత్తం 285 బ్లాకులుగా విభజించారు. ప్రతి బ్లాక్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, అక్కడి పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తి బాధ్యత అప్పగించారు. చెత్త సకాలంలో తొలగించడం, టాయిలెట్ల శుభ్రత, మురుగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడడం వంటి అంశాలను రోజువారీగా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతర ప్రాంతంలో మొత్తం 5,700 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీటిని శుభ్రంగా నిర్వహించేందుకు సుమారు 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. చెత్త సేకరణ, తరలింపునకు 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మెషిన్లు, 12 జేసీబీలు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లు నిరంతరం పని చేయనున్నాయి.

జంతు కళేబరాలు–ప్లాస్టిక్‌పై ప్రత్యేక దృష్టి
జాతర సమయంలో జంతు బలులు, ఆహార తయారీ కారణంగా జంతు కళేబరాలు, మిగిలిన ఆహారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోతాయని అధికారులు చెబుతున్నారు. ఇవి సమయానికి తొలగించకపోతే దుర్వాసనతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈసారి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, జంతు కళేబరాలు, ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్తను వెంటనే సేకరించి నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో డస్ట్‌బిన్లు, చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, చెత్తను వేరు వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నారు.

జాతర తర్వాత కూడా పది రోజుల శుభ్రత
మహాజాతర 31తో ముగిసినా, ఆ తర్వాత కూడా పది రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం కొనసాగించనున్నారు. అడవులు, వాగులు, రహదారులు, శిబిర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు పూర్తిగా పరిశుభ్రం అయ్యేవరకు పనులు ఆగవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జాతర అనంతరం మేడారం పరిసరాలు మళ్లీ సహజ స్థితికి రావాలన్నదే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా, భక్తుల సహకారం లేకుండా పరిశుభ్రమైన జాతర సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్లలోనే చెత్త వేయాలని, టాయిలెట్లను సరిగా వినియోగించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పవిత్ర స్థలాన్ని కాపాడాలి
“మేడారం పరిసర ప్రాంతాలు వనదేవతలు సంచరించిన పవిత్ర ప్రదేశాలు. భక్తులు తాము తెచ్చుకున్న ప్లాస్టిక్, గాజు వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, నిర్దేశించిన ప్రదేశాల్లో లేదా పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలి” అని ములుగు డిపిఓ వెంకయ్య విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, రెండు నుంచి మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో పరిశుభ్రమైన మేడారమే ఈసారి జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిలుస్తోంది.


