బీజేపీలోకి పేరం గోపికృష్ణ
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో చేరిక
ఉన్నత విద్యావంతుడు పార్టీలోకి రావడం అభినందనీయం
కష్టపడి పనిచేస్తే ప్రతీ ఒక్కరికి పార్టీలో ఉన్నత అవకాశాలు
పార్టీ ఫస్ట్.. పర్సన్ నెక్ట్స్ లక్ష్యంతో పనిచేయాలి
చేరిక సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచనలు
ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి : గోపికృష్ణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్చంద రాజీనామా చేసిన పేరం గోపికృష్ణ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. హన్మకొండ జిల్లా పెగడపల్లి గ్రామానికి చెందిన గోపికృష్ణ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేసిన గోపికృష్ణ రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు. హన్మకొండ నుంచి తన అనుచరులతో భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వెళ్లిన గోపికృష్ణను రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పారు. ఈసందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడైన గోపికృష్ణ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.

పనిచేస్తేనే జనంలో గుర్తింపు..!
హన్మకొండలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈసందర్భంగా గోపికృష్ణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. పార్టీ ఫస్ట్.. పర్సన్ నెక్ట్స్ అనే ఆలోచనతో పనిచేయాలని, అంకితాభావంతో పనిచేసే వారికి తప్పకుండా పార్టీలో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. జనంలో ఉంటూ ప్రజా సమస్యలను గుర్తించి.. వారికి అండగా ఉన్న వారికి జనం నేతల వెంట ఉంటారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ.. నిత్యం జనంలో ఉండే నాయకులకు తప్పకుండా రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారని అన్నారు. పార్టీలో అందరితో సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగిన గోపికృష్ణ మంచి జననేతగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా బీజేపీలో జాయిన్ అయిన గోపికృష్ణకు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈసందర్భంగా గోపికృష్ణకు సూచించారు.
ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి : గోపికృష్ణ
ప్రజా సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు పేరం గోపికృష్ణ తెలిపారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా అంకితాభావంతో పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మార్గదర్శకంలో హన్మకొండలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ఎంతో ప్రగతి, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను జనంలోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.


