31 మంది బెల్ట్ షాపులు నిర్వాహాకుల బైండోవర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా నిర్వహిస్తున్న మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని సీఐ డి. మధు అన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీఐ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న 31 మంది దుకాణ యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మద్యం మత్తులో ఘర్షణ వాతావరణంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లోని కిరాణా షాపుల్లో బెల్ట్ దందా సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలోని స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు సమాచారం తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికలలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ తో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.


