మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబాలు బాగు పడతాయని, మహిళల ఉన్నతికి పటిష్ట కార్యాచరణ చేపట్టామని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం బైపాస రోడ్ లో టిసీవి రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గం నాలుగు మండలాల సహాయ సంఘాల మహిళలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్డర్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించామని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరికి చీర తప్పకుండా అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం తరపున ఇందిరమ్మ చీరలు ఇంటింటికి వెళ్లి అందజేయాలని అన్నారు. పెట్రోల్ పంపు, సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీకి అద్దె బస్సుల ఏర్పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు వంటి అనేక వ్యాపార అవకాశాలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మహిళల చేతిలో డబ్బులు ఉంటే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో అర్హులైన మహిళలు మొత్తం 53 వేల మందికి చీరెలు పంపిణీ సజావుగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు ఆఫీస్ ఇన్ చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వివరించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సన్యాసయ్య, మద్దులపల్లి మార్కెట్ కమిటి చైర్మన్ హరినాథ్ బాబు, తహసీల్దార్లు రాంప్రసాద్, విల్సన్, వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


