మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు
మాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే దొంతి
కాకతీయ, నర్సంపేట : మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. ఆదివారం మాధన్నపేట చెరువులో జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలసి చేపపిల్లల విడుదల చేశారు. 6 లక్షల 81 వేల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పెద్ద చెరువైన మాధన్నపేట మత్స్య సహకార సంఘంలోని ప్రతీ సభ్యుడు చేపల పెంపకం లో నైపుణ్యం పెంపొందించుకొని ప్రైవేట్ వ్యక్తులకు చేపల ఉత్పత్తిని అప్పగించకుండా స్వంతంగా నిర్వహించాలని కోరారు. మొత్తం 11 లక్షల 50 వేల రూపాయల విలువైన చేప పిల్లలు విడుదల చేసినట్లు తెలిపారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధిలో మత్స్యోత్పత్తి చాలా కీలక పాత్ర పోషిస్తుందని, ఈరోజు చేప పిల్లలను చెరువులో వదిలించడం ద్వారా స్థానిక మత్స్యకారుల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రజలకు పోషకాహార భద్రతను కూడా మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం చేపల పెంపకానికి అవసరమైన అన్ని రకాల సహాయాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు.రైతులు, యువకులు, మహిళా సంఘాలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి , మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతి, మార్కెట్ చైర్మెన్ పాలాయి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


