సింగరేని కార్మికులకిచ్చిన హామీలను నెరవేర్చాలి
జాగృతి కవిత అరెస్టు అన్యాయం
ఖండించిన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
కాకతీయ, కరీంనగర్ : సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేయడాన్ని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికుల కోసం హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణ, అలియాస్ కార్మికులకు అవకాశాలు, సొంతింటి పథకం అమలు, ఐటీ నిహాయింపులు ఇవన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని హరిప్రసాద్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై కవిత శాంతియుతంగా ముట్టడికి పిలుపునిచ్చితే, ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడిందని ఆయన అన్నారు. జిల్లాల వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచే జాగృతి, హెచ్ ఎం ఎస్ కార్మిక సంఘాల వందలాది నాయకులను స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్యవ్యతిరేక చర్యగా హరిప్రసాద్ విమర్శించారు.నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని, సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు కవిత నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.


