సమాజంలో వయోవృద్ధుల ప్రాముఖ్యత చాలా గొప్పది
వయోవృద్ధులను గౌరవిద్దాం వారి అనుభవాల్ని స్వీకరిధాం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకతాన్ (ర్యాలీ) నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈనెల 12 నుండి 19వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాచీన కాలం నుండి భారత దేశ సంస్కృతిలో వయోవృద్ధులను గౌరవించడం మన సంస్కృతి అని,వారి పట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో కూడా అలాగే వయోవృద్ధులను గౌరవించి వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. సమాజంలో వయోవృద్ధుల ప్రాముఖ్యత చాలా గొప్పదని, వారు దిశా నిర్దేశకులని తెలిపారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మన కుటుంబంలో ఉన్న వయోవృద్ధులను అనగా గ్రాండ్ పేరెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారితో మర్యాదగా ఉండాలని, వారి అనుభవం పిల్లలకు చాలా స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రస్తుతము వయోవృద్ధుల సమస్యలు మరియు పిల్లలు కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదని, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ కొట్టడం తిట్టడం ఆస్తులు లాక్కోవడం ఇలాంటి సమస్యలు మా దృష్టికి చాలా వస్తున్నాయని, వారి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టామని, తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు తెలిపారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి మాట్లాడుతూ, వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూన్నామని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొడుకులు కోడళ్ళు, కూతుళ్లకి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారి బాధ్యతల్ని గుర్తింప చేస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లా మొత్తంగా వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టము మరియు టోల్ ఫ్రీ నెంబర్ 14567 గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి రాజమణి , డి ఎం & హెచ్ ఓ సాంబశివరావు, జిల్లాలోని పలు ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు, వయోవృద్ధుల అసోసియేషన్ మెంబర్స్, వయోవృద్ధులు ర్యాలీలో పాల్గొన్నారు


