ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు…
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ప్రధాన జంక్షన్ ల వద్ద రోడ్లపై గో స్లో వైట్ పేయింట్
ఆర్ అండ్ బీ, మున్సిపల్ రోడ్ల నిర్వహణపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్, ఖమ్మం నగర పరిధిలో ఆర్ అండ్ బీ, మున్సిపల్ రోడ్ల నిర్వహణ, మరమ్మత్తు పనులపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 20 బ్లాక్ స్పాట్స్ లు గుర్తించి, అక్కడ స్పీడ్ కంట్రోల్ కు రంబుల్ ష్ట్రిప్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లపై లైన్ మార్కింగ్ ఉండేలా చూడాలని, లైన్ మార్కింగ్ వినియోగం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో ప్రధాన జంక్షన్ల వద్ద రోడ్డుపై గో స్లో వైట్ పేయింట్ వేయాలని అన్నారు. ఐరాడ్ (ఇంటిగ్రేటెడ్ రోడ్డు ఆక్సిడెంట్ డిటెక్షన్ సెంటర్) వంటివి పరిశీలించి ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ వెంటనే సిద్దం చేసి, నెల రోజులలో మార్పు చూపించాలని అన్నారు. నగర పరిధిలో నూతన రోడ్లు వేసే సమయంలో ఖచ్చితంగా డ్రైయిన్ కూడా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రోడ్డుపై దుమ్ము అధికంగా ఉండటం వల్ల గాలి నాణ్యత కూడా తగ్గుతుందని అన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్ దానవాయిగూడెం నుండి రామన్నపేట ఆర్ అండ్ బీ రోడ్డు నూతనంగా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దానవాయిగూడెంలో టి.జి.ఎస్.డబ్ల్యూ.ఆర్. పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు) మరమ్మత్తు పనులకు సంబంధించి పిల్లలకు ఇచ్చిన మాట మేరకు మంత్రివర్యులు 3 కోట్ల 80 లక్షల కేటాయించడం జరిగిందని, అట్టి నిధులతో కాంపౌండ్ వాల్, ల్యాండ్ ఫిల్లింగ్, జనరేటర్ ఏర్పాటు, స్పోర్ట్స్ ఇన్ ఫ్రా (వాలీ బాల్ కోర్టు) కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. విద్యార్థినులకు అవసరమైన వసతులు ఉండేలా భవనంలో మరమ్మత్తు పనులు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ. యాకోబు, ఇఇ పవార్, పబ్లిక్ హెల్త్ ఇ ఇ రంజిత్, విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, మునిసిపల్ డిఇ ధరణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



